February 25, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, నాగ‌శౌర్య 9 నెల‌లు డిప్రెష‌న్‌లో ఉన్నాడు!, Indian & World Live Breaking News Coverage And Updates

నాగ‌శౌర్య 9 నెల‌లు డిప్రెష‌న్‌లో ఉన్నాడు!

Share This :

నాగ‌శౌర్య 9 నెల‌లు డిప్రెష‌న్‌లో ఉన్నాడు!

2020-11-06 21:39:48

 

చాలా మంది మాదిరిగానే చిన్న‌ప్ప‌ట్నుంచీ నాగ‌శౌర్య‌కు సినిమాలంటే మోజు. ఇంట‌ర్మీడియేట్ సెకండ్ ఇయ‌ర్‌లో ఉన్న‌ప్పుడు సినిమాల్లోకి వెళ్లాల‌నే త‌న కోరిక‌ను ఇంట్లోవాళ్ల‌కు చెప్పాడు. అప్ప‌ట్నుంచీ ఐదేళ్ల‌పాటు అవ‌కాశాల కోసం తెగ తిరిగాడు. కొన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయేవి. “నాకు అవ‌కాశం చేజారిన సినిమాల్లో మంచి ద‌ర్శ‌కుల‌వీ, నిర్మాత‌ల‌వీ కూడా ఉన్నాయి. దాంతో ఇక నాకు అవ‌కాశాలు రావేమోన‌ని 2012లో డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాను. తొమ్మిది నెల‌ల కాలం డిప్రెష‌న్‌లో ఉన్నా. అలా కుంగిపోవ‌ద్ద‌నీ, ఎప్ప‌టికైనా సాధిస్తావ‌నీ, అప్ప‌టిదాక‌కా వెయిట్ చెయ్య‌మ‌నీ మా అన్న‌య్య గౌత‌మ్ నాకు ధైర్యం నూరిపోసేవాడు” అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు శౌర్య‌.

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ సినిమా ఆడిష‌న్‌కు ర‌మ్మంటూ క‌బురొచ్చిన‌ప్పుడు పెద్ద‌గా ఆశ‌ల్లేకుండానే వెళ్లాడు. ఆడిష‌న్స్ అయ్యాక కాల్ చేస్తామ‌ని చెప్పారు. దాంతో ఆ అవ‌కాశం కూడా పోయిన‌ట్లేన‌ని అత‌ను డిసైడ‌య్యాడు. ఇంకో సినిమా ప్ర‌య‌త్నాల్లో ప‌డిపోయాడు. ఆ రోజు వినాయ‌క చ‌వితి. ఇంట్లో అంద‌రితో పాటు శౌర్య కూడా పూజ‌లో ఉన్నాడు. ఇంత‌లో ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ ద‌ర్శ‌కుడు శ్రీ‌ని అవ‌స‌రాల నుంచి ఫోన్ కాల్‌… “శౌర్యా.. వెంట‌నే ఆఫీస్‌కు రా” అని.

“చాలా ఫాస్ట్‌గా సాయి కొర్ర‌పాటిగారి ఆఫీస్‌కు చేరుకున్నా. త‌లుపు తెర‌వ‌గానే ఎదురుగా రాజ‌మౌళిగారు క‌నిపించారు. ర‌మా రాజ‌మౌళిగారు, కీర‌వాణిగారు, యార్ల‌గ‌డ్డ శోభుగారు, సాయిగారు, శ్రీ‌నివాస్‌గారు.. అంద‌రూ అక్క‌డున్నారు. సాయిగారు న‌న్ను అక్క‌డి దేవుని ప‌టాల వ‌ద్ద కొబ్బ‌రికాయ కొట్ట‌మ‌న్నారు. నా పూర్తిపేరు అడిగి పూజ చేయించారు. కీర‌వాణిగారు అడ్వాన్స్ చెక్కు నా చేతిలో పెట్టారు. అప్ప‌టికే నా మైండ్ బ్లాంక్‌. సాయిగారు, చెక్కు త‌ప్ప నాకెవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. ఆ రూమ్‌లోంచి ఎలా బ‌య‌ట‌కొచ్చానో కూడా తెలీదు. అంత ఉద్వేగానికి గుర‌య్యా. ఇంటికొచ్చి చెబితే అమ్మావాళ్లెవ‌రూ న‌మ్మ‌లేదు. చెక్కు చూపించాకే న‌మ్మారు. ఆ చెక్కుని నేను క్యాష్ చేసుకోకుండా ఓ జ్ఞాప‌కంగా దాచుకున్నా” అని తెలిపాడు శౌర్య‌.

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ విడుద‌ల‌య్యాక థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చొని, వాళ్ల స్పంద‌న‌ను చూడ‌టం అత‌డికి మ‌ర‌చిపోలేని అనుభ‌వం. “ఆ రోజు ఓ మాయ‌లా గ‌డిచింది” అని గుర్తుచేసుకున్నాడు. ఆ త‌ర్వాత అత‌డి క‌థ ఎలా మారిందో మ‌నం చూస్తూనే ఉన్నాం.

Share This :